- మంచిర్యాల జిల్లా భీమారంలో వెలుగులోకి..
- పోలీసులను ఆశ్రయించిన బాధితులు
జైపూర్ (భీమారం)వెలుగు : ఇసుక వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో లాభాలు వస్తాయంటూ పలువురిని నమ్మించిన అన్నదమ్ములు రూ. 3 కోట్లు వసూలు చేసి కనిపించకుండా పోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... భీమారం గ్రామానికి చెందిన వేముల శ్రవణ్‌గౌడ్, రాజ్‌కిరణ్ అన్నదమ్ములు. వీరు కల్లుగీత వృత్తితో పాటు బేకరీ, టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు.
ఈజీగా డబ్బు సంపాదించాలని భావించిన శ్రావణ్‌గౌడ్, రాజ్‌కిరణ్.. తమ బందువులకు ఇసుక రీచ్‌లు ఉన్నాయని, అందులో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని పలువురిని నమ్మించి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు.
ఇలా తమ స్నేహితులు, బంధువులు, చిన్న చిన్న వ్యాపారుల వద్ద రూ. 50 వేల నుంచి రూ. 20 లక్షల వరకు తీసుకున్నారు. మొత్తం 100 మంది నుంచి రూ. 3 కోట్లకుపైగా వసూలు చేశారు. నాలుగు రోజులుగా శ్రవణ్‌గౌడ్ ఫోన్ కలవకపోవడం, బేకరీ, టిఫిన్ సెంటర్ మూసి ఉంటుండడంతో పలువురు ఇంటికి వెళ్లి ఆరా తీశారు.
కుటుంబసభ్యులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో శ్రావణ్‌గౌడ్, రాజ్‌కిరణ్ తమను మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.
